Sunday, August 16, 2009

Khadgam - om kaara nadamtho

ఓంకారనాదంతో అంకురించిన వేదధాత్రికి సంకేతం ఈ ఖడ్గం

హ్రీంకారనాదంలో సంచరించే ఆదిశక్తికి ఆకారం ఈ ఖడ్గం

యుగయుగాలుగా గమనమాగని ఘనత ఈ ఖడ్గం

తరతరాలుగా తరలి వచ్చిన చరిత ఈ ఖడ్గం


తన కళ్ళ ముందే సామ్రాజ్య శిఖరాలు మన్నుపాలైనా

క్షణమైనా తన గాథ గతములో విడిచి ధ్రుతి ఒడి చేరనిదీ ఖడ్గం

ఊటతో పడమరను దాటి పూర్వార్ధిపై నిత్య ప్రభాతమై వెలుగుతున్నదీ భరత ఖడ్గం


కేవలం ఆయుధం కాదు ఈ ఖడ్గం

ఏదో మహాద్భుతం ఉన్నదీ ఖడ్గం

మూడువన్నెల కేతముగ మింటికి ఎగసి కాలానికెదురేగు యశోరాశి ఈ ఖడ్గం


హరిని ధరపై అవతరించగ గెలుచుకొచ్చిన భక్తి ఖడ్గం

నరునిలో దైవాంశనే దర్శించి కొలిచిన ముక్తిమార్గం

ఆర్తరక్షణకై ధరించిన ధీరగుణమీ ఖడ్గం

ధూర్తశిక్షణకై వహించిన కరకుతనమీ ఖడ్గం

హూంకరించి అహంకరించి అధిక్రమించిన ఆకతాయిల అంతు చూసిన క్షాత్రసత్వం

అస్తమించని అర్థఖడ్గం

శరణుకోరి శిరస్సువంచి సమాశ్రయించిన అన్ని జాతుల పొదువుకున్న ఉదారతత్వం

జగతి మరువని ధర్మఖడ్గం


నిద్దుర మత్తును వదిలించే గెంజాయల జిలుగీ ఖడ్గం

చిక్కటి చీకటి చీల్చుకువచ్చే తెల్లని వెలుగీ ఖడ్గం

మట్టిని చీల్చుకు చిగురించే సిరి పచ్చని చిగురీ ఖడ్గం

గెంజాయల జిలుగీ ఖడ్గం

తెలతెల్లని వెలుగీ ఖడ్గం

సిరిపచ్చని చిగురీ ఖడ్గం

Saturday, August 15, 2009

Gaayam - Niggadeesi Adugu

నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని

అగ్గితోటి కడుగు ఈ సమాజ జీవచ్ఛవాన్ని

మారదు లోకం మారదు కాలం

దేవుడు దిగిరానీ ఎవ్వరు ఏమైపోనీ

మారదు లోకం మారదు కాలం


గాలివాటు గమనానికి కాలిబాట దేనికి

గొర్రెదాటు మందకి నీ ఙానబోధ దేనికి

ఏ చరిత్ర నేర్చుకుంది పచ్చని పాఠం

ఏ క్షణాన మార్చుకుంది చిచ్చుల మార్గం

రామబాణమార్పిందా రావణ కాష్టం

కృష్ణ గీత ఆపిందా నిత్య కురుక్షేత్రం


పాత రాతి గుహలు పాల రాతి గృహాలైనా

అడవి నీతి మారిందా ఎన్ని యుగాలైనా

వేట అదే వేటు అదే నాటి కథే అంతా

నట్టడవులు నడివీధికి నడిచొస్తే వింతా

బలవంతులె బ్రతకాలనే సూక్తి మరవకుండ

శతాబ్దాలు చదవలేద ఈ అరణ్య కాండ

Thursday, August 13, 2009

Sirivennela - viDhata Talapuna

విధాత తలపున ప్రభవించినది అనాది జీవన వేదం - ఓం

ప్రాణ నాడులకు స్పందననొసగిన ఆది ప్రణవ నాదం- ఓం

కనుల కొలనులో ప్రతిబింబించిన విశ్వరూప విన్యాసం

ఎద కనుమలలో ప్రతిధ్వనించిన విరించి విపంచి గానం


సరసుస్వర సురఝరీ గమనమౌ సామవేద సారమిది

నే పాడిన జీవన గీతం ఈ గీతం

విరించినై విరచించితిని ఈ కవనం

విపంచినై వినిపించితిని ఈ గీతం


ప్రాగ్దిశ వీనియపైన దినకర మయూఖతంతృల పైన

జాగృత విహంగతతులే వినీల గగనపు వేదిక పైన

పలికిన కిలకిల స్వరముల స్వరజతి జగతికి శ్రీకారము కాగా

విశ్వకావ్యమునకది భాష్యముగ


విరించినై ...


జనించు ప్రతి శిశు గళమున పలికిన జీవన నాదతరంగం

చేతన పొందిన స్పందన ధ్వనించు హృదయ మృదంగధ్వానం

అనాది రాగం ఆది తాళమున అనంత జీవన వాహినిగా

సాగిన సృష్టి విలాసమునే


విరించినై ...


నా ఉచ్చ్వాసం కవనం

నా నిశ్వాసం గానం

సరసుస్వర సురఝరీ గమనమౌ సామవేద సారమిది

నే పాడిన జీవన గీతం ఈ గీతం

విరించినై విరచించితిని ఈ కవనం

విపంచినై వినిపించితిని ఈ గీతం

Monday, August 10, 2009

Ankuram - Evaro Okaru

ardha satAbdapu

అర్ధశతాబ్దపు అఙానాన్ని స్వతంత్రమందామా స్వర్ణోత్సవాలు చేద్దామా

ఆత్మ వినాశపు అరాచకాన్ని స్వరాజ్యమందామా దానికి సలాము చేద్దామా

శాంతి కపోతపు కుత్తుక తెంచి తెచ్చిన బహుమానం ఈ రక్తపు సిందూరం

నీ పాపిటలొ భక్తిగదిద్దిన ప్రజలను చూడమ్మా ఓ పవిత్ర భారతమా !


కులాల కోసం గుంపులు కడుతూ మతాల కోసం మంటలు పెడుతూ

ఎక్కడలేని తెగువను చూపి తగువుకి లేస్తారే జనాలు తలలర్పిస్తారే

సమూహ క్షేమం పట్టని స్వార్థపు ఇరుకుతనంలో ముడుచుకు పోతూ మొత్తం దేశం తగలడుతోందని

నిజం తెలుసుకోరే, తెలిసి భుజం కలిపి రారే

అలాంటి జనాల తరఫున ఎవరో ఎందుకు పోరాడాలి పోరి ఏమిటి సాధించాలి

ఎవ్వరికోసం ఎవరు ఎవరితో సాగించే సమరం ఈ చిచ్చుల సిందూరం

జవాబు చెప్పే బాధ్యత మరచిన జనాల భారతమా ఓ అనాథ భారతమా!


అన్యాయాన్ని సహించని శౌర్యం దౌర్జన్యాన్ని దహించే ధైర్యం

కారడవుల్లో క్రూరమృగంలా దాక్కుని ఉండాలా వెలుగుని తప్పుకు తిరగాలా

శతృవుతో పోరాడే సైన్యం శాంతిని కాపాడే కర్త్యవ్యం

స్వజాతి వీరులనణచే విధిలో సవాలు చెయ్యాలా అన్నల చేతిలొ చావాలా

తనలో ధైర్యం అడవికి ఇచ్చి తన ధర్మం చట్టానికి ఇచ్చి

ఆ కలహం చూస్తూ సంఘం శిలలా నిలుచుంటే

నడిచే శవాల సిగలో తురుమిన నెత్తుటి మందారం ఈ సంధ్యాసిందూరం

వేకువ వైపా చీకటిలోకా ఎటు నడిపేనమ్మా గతి తోచని భారతమా!


తన తలరాతను తానే రాయగల అవకాశాన్నే వదులుకొని

తనలో భీతిని తన అవినీతిని తన ప్రతినిధులుగ ఎన్నుకుని

ప్రజాస్వామ్యమని తలిచే జాతిని ప్రశ్నించడమే మానుకొని

కళ్ళు వున్న ఈ కబోది జాతిని నడిపిస్తుందట ఆవేశం

ఆ హక్కేదో తనకే ఉందని శాసిస్తుండట అధికారం

కృష్ణుడు లేని కురుక్షేత్రముగ సాగే ఈ ఘోరం చితిమంటల సిందూరం

చూస్తూ ఇంకా నిదురిస్తావా విశాల భారతమా ఓ విషాద భారతమా!

Friday, August 7, 2009

Rudraveena - lalita priyakamalam

లలిత ప్రియ కమలం విరిసినది కన్నుల కొలనిని

ఉదయ రవి కిరణం మెరిసినది ఊహల జగతిని

అమృత కలశముగ ప్రతి నిమిషం

కలిమికి దొరకని చెలిమిని కురిసిన అరుదగు వరమిది


రేయి పవలు కలిపే సూత్రం సాంధ్యరాగం

కాదా నీలో నాలో పొంగే ప్రణయం

నేల నింగి కలిపే బంధం ఇంద్రఛాపం

కాదా మన స్నేహం ముడివేసే పరువం

కలల విరుల వనం మన హృదయం

వలచిన ఆమని కూరిమి మీరగ చేరిన తరుణం

కోటి తలపుల చివురులు తొడిగెను

తేటి స్వరముల మధువులు చిలికెను

తీపి పలుకుల చిలుకల కిలకిల

తీగ సొగసుల తొణికిన మిలమిల

పాడుతున్నది ఎద మురళి

రాగ ఝరి తరగల మృదురవళి

తూగుతున్నది మరులవని

లేత విరి కులుకుల నటనగని

వేల మధుమాసముల పూల దరహాసముల మనసులు మురిసెను


కోరే కోవెల ద్వారం నీవై చేరుకోగ

కాదా నీకై మ్రోగే ప్రాణం ప్రణవం

తీసే శ్వాసే ధూపం చూసే చూపే దీపం

కాదా మమకారం నీ పూజాకుసుమం

మనసు హిమగిరిగ మారినది

కలసిన మమతల స్వరజతి పశుపతి పదగతికాగ

మేని మలుపుల చెలువపు గమనము

వీణ పలికిన జిలిబిలి గమకము

కాలి మువ్వగ నిలిచెను కాలము

పూల పవనము వేసెను తాళము

హేయమైనది తొలి ప్రాయం

మ్రాయమని మాయని మధుకావ్యం

స్వాగతించెను ప్రేమ పథం

సాగినది ఇరువురి బ్రతుకు రథం

కోరికల తారకల సీమలకు చేరుకొనె వడివడి పరువిడి

Wednesday, August 5, 2009

Ankuram - Evaro Okaru

ఎవరో ఒకరు ఎపుడో అపుడు
నడవరా ముందుగా అటో ఇటో ఎటో వైపు
అటో ఇటో ఎటో వైపు
మొదటి వాడు ఎప్పుడూ ఒక్కడే మరీ
మొదటి అడుగు ఎప్పుడూ ఒంటరే మరీ
వెనుకవచ్చు వాళ్ళాకు బాట అయినది
ఎవరో ఒకరు ఎపుడో అపుడు
నడవరా ముందుగా అటో ఇటో ఎటో వైపు
అటో ఇటో ఎటో వైపు

కదలరు ఎవ్వరూ వేకువ వచ్చినా
అనుకుని కోడి కూత నిదరపోదుగా
జగతికి మేలుకొల్పు మానుకోదుగా
మొదటి చినుకు సూటిగా దూకిరానిదే
మబ్బుకొంగు చాటుగా ఒదిగి దాగితే
వానధార రాదుగా నేలదారికీ
ప్రాణమంటు లేదుగా బ్రతకడానికీ
ఎవరో ఒకరు ఎపుడో అపుడు
నడవరా ముందుగా అటో ఇటో ఎటో వైపు
అటో ఇటో ఎటో వైపు

చెదరకపోదుగా చిక్కని చీకటి
మిణుగురు రెక్కచాటు చిన్ని కాంతికి
దానికి లెక్కలేదు కాళరాతిరీ
పెదవి ప్రమిద నిలపనీ నవ్వు జ్యోతినీ
రెప్పవెనుక ఆపనీ కంటినీటినీ
సాగలేక ఆగితే దారి తరుగునా?
జాలిచూపి తీరమే దరికి చేరునా
ఎవరో ఒకరు ఎపుడో అపుడు
నడవరా ముందుగా అటో ఇటో ఎటో వైపు
అటో ఇటో ఎటో వైపు

యుగములు సాగినా నింగిని తాకక
ఎగసిన అలల ఆశ అలిసిపోదుగా
ఓటమి ఒప్పుకుంటు ఆగిపోదుగా
ఎంత వేడి ఎండతో ఒళ్ళు మండితే
అంత వాడి ఆవిరై వెళ్ళి చేరదా
అంత గొప్ప సూర్యుడు కళ్ళు మూయడా
నల్ల మబ్బు కమ్మితే చల్లబారడా
ఎవరో ఒకరు ఎపుడో అపుడు
నడవరా ముందుగా అటో ఇటో ఎటో వైపు
అటో ఇటో ఎటో వైపు